కరోనాపై పోరుకు రూ. 7,500 కోట్లు

కరోనాపై పోరాటానికి ట్విట్టర్‌ సీఈవో జాక్‌ డోర్సీ భారీ సాయాన్ని ప్రకటించారు. ఇందుకోసం రూ.7,500 కోట్ల(100 కోట్ల డాలర్లు)ను ఇవ్వనున్నట్లు మంగళవారం తెలిపారు. తన ఆన్‌లైన్‌ ఆర్థిక సేవల సంస్థ ‘స్కేర్‌' నుంచి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. కరోనా సహాయ కార్యక్రమాలు చేపట్టడానికిగాను ఈ మొత్తాన్ని తాను స్థాపించిన సేవా సంస్థ ‘స్టార్ట్‌ స్మాల్‌'కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ప్రపంచానికి సహాయం అత్యవసరమని చెప్పారు. తాను చేసిన సాయాన్ని చూసి మరికొందరు స్ఫూర్తి పొందుతారని భావిస్తున్నానని, వాళ్లు కూడా తనలాగే ముందుకు వచ్చి సాయం చేస్తారనుకుంటున్నానని తెలిపారు. జీవితం చాలా చిన్నదని, కాబట్టి సహాయం అవసరమున్న వారికి ఈ రోజే చేయూతనిద్దామని జాక్‌ డోర్సీ పిలుపునిచ్చారు. కాగా జాక్‌ డోర్సీ చేసిన సాయం ఆయన సంపదలో 28 శాతం కావడం గమనార్హం.